Thursday, June 25, 2009

మద్యానికే మహారాజ పోషణ

మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూడం. బెల్టు షాపులు రద్దు చేస్తాం. దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాం. అని రాజశేఖర్ రెడ్డి పార్టీ 2004 లో తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానమిది. ఈ ఐదేళ్ళలో రాష్ట్రంలో ఈ పార్టీ అందుకు పూర్తిగా భిన్నంగా ప్రవర్తించిది. మద్యం అమ్మకాలద్వారా ఏటా రు.12000కోట్ల ఆదాయం వస్తుంది.
పలు ఆర్ధిక, సామాజిక రుగ్మతలకు మూలకారణం మద్యమే. దీని వల్ల బాలకార్మిక వ్యవస్థ విస్తరిస్తుంది. మద్యానికి బానిసలై భర్త మరణించగా , బిడ్డల పోషణ భారంతో కుంగిపోతున్న మూడు పదులలోపు వయసు గల మహిళలు ఒక్క మెదక్ జిల్లాలోనే 16000 మంది ఉన్నారు. నేరాలూ ఘోరాలూ, హత్యలూ, అత్యాచారాలూ, ప్రకోపాలూ, ప్రమాదాలూ జరగడానికి మద్యమే ప్రధాన కారణం. వైన్ షాపుల వద్దే బహిరంగ మద్య సేవనం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. రెండు రూపాయలు మాత్రమే విలువచేసే చీపు లిక్కరు సీసాను రు.50 వరకూ అమ్ముతూ పేదప్రజల కష్టార్జితాన్ని రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దోచుకుంటుంది. కల్తీకల్లు మాఫియా రూపేణా మరో కాలనాగు బడుగుల జీవితాల్లో విషం చిమ్ముతుంది. మద్యం అమ్మకాలు మరింత జోరుగా సాగించి మద్యం అమ్మకాలు పెంచాలని ముఖ్యమంత్రి వైయ్యస్ రాజశేఖరరెడ్డి ఎక్సైజు శాఖ అధికారులకు హుకుం జారీ చేశాడు. అభివృద్ధే తమ ఎజండా అని ఢంకా బజాయిస్తున్న రాజశేఖర్ రెడ్డి మద్యం అమ్మకాల్లో దాన్ని సాకారం చేశారు. మాటమీదకాదూ మద్యం మీద నిలబడతానని నిరూపించుకున్నాడు. ఎన్నికల సమయంలో కోట్లరూపాయల అక్రమమద్యం పట్టుబడింది. ధనం ,ద్రవం ఎన్నికల ఫలితాలను శాసించినంతకాలం ప్రజాస్వామ్యం తప్పటడుగులు వేయకతప్పదు.

No comments: