Tuesday, June 23, 2009

"నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి " అన్న విలువకు బొంద పెట్టాలి

మతం మనుషుల మెదళ్ళపై పెత్తనం చేస్తున్నది. ప్రతి మతం స్త్రీని పురుషుడికి సంబంధించిన ఒక వస్తువుగా చిత్రీకరించింది. వీటి ప్రకారం స్త్రీ పిల్లల్ని కనే ఓ యంత్రం. పురుషుడి ఆస్తికి వారసుడిని కనలేకపోతే విసర్జించాల్సిన యంత్రం. ఒక క్రమంలో రాజుల, జమీందారుల, భూస్వాముల భోగవస్తువు. నేటి వ్యాపార సమాజంలో స్త్రీ వర్తకపు సరుకు. పురుషుడి విసృంఖల కామానికి బలి పశువుగా మారింది.

కొన్ని సంవత్సరాల క్రితం క్రింది వర్గాల స్త్రీలపై పెత్తందారుల దౌస్ట్యాల గురించి వింటూ వుండేవారం. నేడది సర్వ వ్యాపితమైంది. పూరి గుడిసెల్లోకి కూడా చొరబడిన టి.వి.లు యువకుల్లో నీచ కామాన్ని రెచ్చగొడుతున్నాయి. ప్రేమ స్థానాన్ని కోరిక ఆక్రమించింది. దానికి తరతరాలుగా పాతుకుపోయిన పురుషాధిపత్యం సంస్కృతి " మంటకు పడమటి గాలిలా " తోడైంది. నాలుగు గోడల వెలుపల జరిగే సంఘటనలే మానవ విలువలను వణికిస్తున్నాయి. నాలుగు గోడల నడుమ అనునిత్యం కోట్లాదిమంది స్త్రీలు అనుభవిస్తున్న నరకయాతనలు మొత్తంగా వెలుగుచూస్తే పురుష వ్యతిరేక స్త్రీ టెర్రరిష్టు గ్రూపులెందుకు ఏర్పడడంలేదా అని ఆశ్ఛర్యం కలుగకమానదు. మానవజాతి పునరుత్పత్తి భారాన్నంతటినీ ఏమనిషి మోస్తున్నదో , ఆస్త్రీపై చిత్తకార్తె కుక్కల్లా అన్ని కార్తెల్లో ఎగబడుతున్న పురుష కామాంధతకు వ్యతిరేకంగా ఒక మహూద్యమం సాగాల్సివుంది. అందుకోసం ముందుగా ప్రగతిశీల మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, తక్షణ, దీర్ఘకాలిక , సమష్టి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి.

No comments: